హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయం

Thursday, 24 Jun, 3.06 pm

కరీంనగర్‌ : హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..తల్లిలాంటి టీఆర్‌ఎస్‌కు ఈటల రాజేందర్‌ ద్రోహం చేశాడని మండిపడ్డారు. రెండు సార్లు మంత్రిని చేస్తే వేల కోట్లు వెనకేసి వెన్నుపోటు రాజకీయాలు చేశాడని విమర్శించారు.

నీకు, నీ కుటుంబ సభ్యులకు కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పాలన దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. కానీ, నీవు చేరిన పార్టీ అంబానీ, ఆదానీలకు దోచిపెట్టే పార్టీ అన్నారు. జ్యోతిబాపూలేను ఆదర్శంగా తీసుకుంటాననే నీవు, రిజర్వేషన్లు తొలగిస్తామంటున్న బీజేపీలో ఎలా చేరుతావని ప్రశ్నించారు. హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, ఈటల లాంటి నమ్మకద్రోహుల నుంచి ప్రజలు విముక్తి పొందుతున్నారన్నారు.